| About Ayyappa Swamy |
|
అయ్యప్పను గురించిన ప్రధాన గాధలు అయ్యప్ప హిందూ దేవతలలో ఒకడు. ఈయనను హరిహరసుతుడని, మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలై లో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. బరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోనే "కుళతుపుళ"లో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. "అచ్చన్ కోవిల్"లో పుష్కల, పూర్ణ అనే దేవేరులసమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి యేటా ఐదుకోట్లమంది భక్తులు దర్శనార్ధులై వెళుతుంటారు. మహిషి కధనం మహిశాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమయిన తరువాత మహిషి బ్రహ్మను ఈ విదంగా కోరింది. శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అదీ కూడ ఆ హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. 'తధాస్తు' అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. అయ్యప్ప జననం క్షీరసాగరమధనం అనంతరం దేవతలకు, రాక్షసుల కు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం దరించి కార్యం నిర్వహిస్తాడు. తరువాత అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసి శివుడు ఆమె పట్ల ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసము, 30వ రోజు శనివారం, పంచమి తిధి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నమందు శాస్త(అయ్యప్ప) జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు ధర్మశాస్త. మహిషి వధ అడవిలో నారదుడు మహిషిని కలిసి అయ్యప్పను గురించి నిన్ను చంపేందుకు ఒక రాజకుమారుడు వస్తున్నాడు అని హెచ్చరిస్తాడు. మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. వీరి యిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్యరూపంలో వస్తారు. ఈ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చూస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మద్య జరిగే భీకరయుద్ధంలో చివరిగా మహిషిని నేలపై విసిరికొడతాడు ఆ దెబ్బకి గేదె రూపంలో ఉన్న మహిషి మరణిస్తుంది. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో దేవేంద్రా! నేను చిరుతపులి పాలు తెచ్చే నెపంపై యిలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని అడుగుతాడు. ఆయన కోరికపై అందరు చిరుతపులులుగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. శబరిమలైలో నివాసం రాజు అయ్యప్పను పట్టాభిషిక్తుడిని చేయాలనుకొంటాడు. కాని రాజ్యాధికారం మీద, భోగభాగ్యాల మీద ఏ మాత్రం మమకారం లేదనీ, వీరపాండ్యచక్రవర్తికీ, ఆయన పట్టమహిషికీ పుట్టిన పట్టికే పట్టాభిషేకం చేయడం ధర్మం అని చెప్పి చక్రవర్తిని ఒప్పిస్తాడు. తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్లి తపస్సు చేసుకుంటాననీ, తనను శరణుకోరి వచ్చే భక్తులను సదా కాపాడుతూ వుంటాననీ పాండ్యరాజుకి వాగ్దానం చేస్తాడు. అయ్యప్ప స్వామి ధర్మప్రవర్తన, ధర్మనిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. తన భక్తులు ఏయే ధర్మాలని పాటించాలో, ఏ నియమనిష్ఠలతో వుండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. అప్పటి నుండి ఆయన 'ధర్మశాస్త'గా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. అందుకే ఆయనకి 'ధర్మశాస్త' అనే పేరు కూడా వుంది. తనకు వాహనంగా వున్న వ్యాఘ్రం (పులి) ఎక్కడ వున్నప్పటికీ తన యజమానిని గుర్తించడానికి వీలుగా మణికంఠ హారాన్ని నిత్యం ధరిస్తూ వుంటాడనీ, అందుచేత 'మణికంఠ' అని కూడా భక్తులు పిలుస్తారనీ కొందరి అభిప్రాయం! ఈ విధంగా, యుగాలు మారుతున్నా, మనుషులు మారుతున్నా, అభిరుచులు మారుతున్నా, 'అయ్యప్పస్వామి' తమ తండ్రి కాని తండ్రి పెంపుడు తండ్రి అయిన పాండ్యరాజుకిచ్చిన వాగ్దానాన్ని ఈ నాటికీ, సదా నిలబెట్టుకుంటూనే వున్నాడు. ఒక సంవత్సరకాలంలో కనీసం 'మండలదీక్ష' (41 రోజులు) నిష్ఠగా పాటిస్తూ దురలవాట్లకీ, వ్యసనాలకీ దూరంగా వుంటూ సంసారబంధాల నుండి బయిటికి వచ్చి నిత్యనామస్మరణతో తనను ఆరాధించే వారికి జీవితాంతం సుఖసంతోషాలు కలిగిస్తూ ఆపదలు తొలగిస్తూ ఆదుకుంటానని చెప్పి భక్తుల పాలిటి కల్పవృక్షమై అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. స్వామి దీక్షాపరులకు అనేక దివ్యమైన అనుభూతులు, అనుభవాలు కలుగుతున్నాయి. శరణాగత రక్షకుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి దివ్యాతి దివ్యమైన చరిత్ర సంపూర్ణం.
|
శ్రీ అయ్యప్ప స్వామి